కొల్లాం (కేరళ): చేతబడి (బ్లాక్ మ్యాజిక్) ఆచారంలో పాల్గొనమని చెప్పిన భర్త మాట విననందుకు భార్యపై దారుణానికి పాల్పడ్డాడు ఒక భర్త. కేరళ రాష్ట్రంకొల్లాం జిల్లాలోని చదాయమంగళం సమీపంలోని వైక్కల్‌లో రెజీల (36) తన భర్త సజీర్ చెప్పిన చేతబడి ఆచారాలకు నిరాకరించిందట. ఓ తాంత్రికుడు చెప్పినట్లుగా భార్య మెడలో లాకెట్ కట్టి, బూడిద పూయాలని సజీర్ ప్రయత్నించగా, రెజీల గట్టిగా వ్యతిరేకించింది. దీంతో ఆగ్రహం చెంది భర్త వేడి చేపల కూరను తీసుకొని భార్యపై పోశాడు. దీంతో ఆమె శరీరంపై తీవ్రమైన కాలిన గాయాలు అయ్యాయి.
ఆమె అరుపులు విన్న పొరుగువారు వెంటనే రెజీలను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం భర్త మీద కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. భార్యకు “దయ్యం పట్టిందని” నమ్మి, సజీర్ తరచూ తాంత్రికుల వద్దకు వెళ్తుండేవాడని విచారణలో బయటపడింది. గతంలో కూడా రెజీలపై దాడి చేశాడని, ఆ సమయంలో ఆమె ఫిర్యాదు చేసిందన్నారు .

