కడప: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జరిగిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. చదువుకోవాల్సిన వయసులో ఓ 17 ఏళ్ల బాలిక హాస్టల్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం అందరినీ నిర్ఘాంతపరిచింది. ప్రేమ పేరుతో అదే కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థి బాలికను మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అసలేం జరిగింది?

ప్రకాశం జిల్లా బెస్తవారిపల్లెకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు కడపలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంఎల్టీ (MLT) చదువుతున్నాడు. అదే కళాశాలలో జూనియర్‌గా ఉన్న 17 ఏళ్ల బాలికతో మొదట స్నేహం చేశాడు. ఈ పరిచయమే తర్వాత ప్రేమగా మారి, శ్రీకాంత్ బాలికను మోసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

బాలిక గర్భవతిగా మారినా, హాస్టల్ నిర్వాహకుల పర్యవేక్షణ కొరవడటం, ఈ విషయాన్ని తోటి విద్యార్థులు సైతం గుర్తించకపోవడం ఆశ్చర్యకరం. గురువారం నాడు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను హాస్టల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల విచారణ..

సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని బాలికను ప్రశ్నించారు. సీనియర్ విద్యార్థి శ్రీకాంత్ తనను మోసం చేశాడని బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు వెంటనే శ్రీకాంత్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఎన్నో ప్రశ్నలు..

చాలా కాలంగా బాలిక హాస్టల్‌లోనే ఉంటూ గర్భాన్ని దాచిపెట్టడం ఎలా సాధ్యమైంది? కళాశాల, హాస్టల్ నిర్వహణ తీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమైంది? అమాయకురాలైన బాలిక జీవితం నాశనమవడానికి కారణమైన శ్రీకాంత్‌పై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? వంటి ప్రశ్నలు ఇప్పుడు కడప ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Kadapa #KadapaNews #AndhraPradesh #CrimeNews #CollegeNews #HostelShock #POCSOCase


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *